తాజా గా విడుదలైన టీ 20 ర్యాంకుల్లో పాకిస్తాన్ కు చెందిన బాబర్ అజాం తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవలే వెస్ట్ ఇండీస్ పై ముగిసిన మూడు మ్యాచుల టీ 20 సిరీస్ లో ఏకంగా 165 పరుగులు చేసిన అజాం, తన కెరీర్ లో రెండో సారి మొదటి స్థానం సాధించాడు.

మాన్ అఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న అజాం, మిస్బా ఉల్ హాక్ తరువాత టీ 20 ర్యాంకుల్లో తొలి స్థానం సాధించిన రెండో పాకిస్తాన్ బాట్స్మన్ కావడం విశేషం. భారత్ బాట్స్మన్ విరాట్ కోహ్లీ మాత్రమే తాజా ర్యాంకుల్లో టాప్ 10 లో స్థానం నిలుపుకున్నాడు.

ఇటీవలే జరిగిన నిదాహస్ ట్రోఫీ లో విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ, తన రేటింగ్ పాయింట్లలో చాలా కోల్పోయాడు. అయినప్పటికి 670 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.

కేవలం ముక్కోణపు సిరీస్ మాత్రమే కాకుండా, అంతకు ముందు జరిగిన శ్రీలంక సిరీస్ కు కూడా కోహ్లీ కు విశ్రాంతి కల్పించడం వలనే అతని రేటింగ్ పాయింట్లు తగ్గినట్టు తెలుస్తుంది.

బౌలర్ల విషయానికి వస్తే తొలి స్థానం లో ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కొనసాగుతున్నాడు. ఐతే వెస్ట్ ఇండీస్ పై చక్కటి ప్రదర్శనలు చేసి ఐదు వికెట్లు సాధించిన యువ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ ఏకంగా పది స్థానాలు ఎగబాకి రెండో స్థానం దక్కించుకోవడం విశేషం.

ఐతే భారత్ తరఫున యుజ్వేంద్ర చాహల్ మాత్రమే మూడో స్థానంలో ఉంది టాప్ 10 జాబితాలో స్థానం సాధించాడు. ఇటీవలే నిదాహస్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన చాహల్, త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ లో కూడా బెంగుళూరు జట్టులో తన సత్తా చాటేందుకు సన్నధం అవుతున్నాడు.

తొలి సారిగా టీ 20 ర్యాంకుల్లో మొదటి ఏడు స్థానాల్లో స్పిన్నర్లే ఉండటం విశేషం కాగా, అందులో ఆరుగురు మణికట్టు స్పిన్నర్లు కావడం గమనార్హం. ఇటీవలే కాలం మణికట్టు స్పిన్నర్లకు ఉన్న మాయను తెలియజెసాయి ఈ ర్యాంకులు.

SHARE