ఈ వారం శ్రీలంక తో ముగిసిన టీ 20 సిరీస్ 3-0 తో కైవసం చేసుకున్న భారత్ జట్టు, తాజా ఐసీసీ ర్యాంకుల్లో రెండో స్థానం దక్కించుకుంది.

అయితే విరాట్ కోహ్లీ కు విశ్రాంతి కల్పించడంతో, భారత్ కెప్టెన్ తన మొదటి స్థానాన్ని కోల్పోయాడు. ఆస్ట్రేలియా బాట్స్మన్ ఆరోన్ ఫించ్ తొలి స్థానం దక్కించుకోగా, బౌలర్లలో పాకిస్తాన్ బౌలర్ ఇమాద్ వసీం తన కెరీర్ లో మొదటి సారి నెం. 1 అయ్యాడు.

ఒక ఆటగాడు మిస్ అయ్యే ప్రతి మ్యాచ్ కు 2 శాతం రేటింగ్ పాయింట్స్ కోల్పోతాడు. అయితే విరాట్ కోహ్లీ మూడు టీ 20 మ్యాచ్ లు ఆడకపోవడంతో 824 పాయింట్ల నుంచి 776 కు వచ్చాడు.

బౌలింగ్ విభాగంలో కూడా తొలి స్థానం లో ఉండే జస్ప్రీత్ బుమ్రా, తాజా ర్యాంకుల్లో మూడో స్థానానికి పడిపోయాడు. అయితే సన్ రైజర్స్ కు ఆడిన ఆఫ్ఘానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో స్థానం సంపాదించాడు.

శ్రీలంక సిరీస్ లో చక్కటి ప్రదర్శనలతో ఆకట్టుకున్న కే ఎల్ రాహుల్, 23 స్థానాలు ఎగబాకి తన కెరీర్ లో అత్యుత్తమమైన నాలుగో స్థానం సాధించాడు. ఇండోర్ టీ 20 మరో సారి సెంచరీ సాధించిన రోహిత్ శర్మ కూడా 14 వ స్థానం దక్కించుకున్నాడు.

భారత్ బౌలర్లు కూడా తమ ర్యాంకులను బాగానే పెంచుకున్నారు. శ్రీలంక సిరీస్ లో ఎనిమిది వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్ 16 వ ర్యాంకుకు చేరగా, అల్ రౌండర్ హార్దిక్ పాండ్య 39 వ స్థానం, కుల్దీప్ యాదవ్ 64 వ సాధించారు.

టీం ర్యాంకులలో భారత్ రెండో స్థానం చేజికించుకోగా, పాకిస్తాన్ తొలి స్థానం లో కొనసాగుతుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు వెస్ట్ ఇండీస్ ఒక్కో స్థానం కోల్పోయాయి.

SHARE