బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలయ్యింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు ప్రత్యర్థి జట్టును కట్టడిచేయడంలో విఫలమయ్యింది. దీంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగులు సాధించింది. 218 పరుగల లక్ష్యచేధనలో తమ జట్టు తడబడిందన విషయం వాస్తవమే అని చెప్పుకొచ్చాడు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి.

అయితే తమ జట్టు అనుకున్నదానికంటే బాగా ఆడిందని కోహ్లి చెప్పాడు. కానీ ప్రత్యర్థి జట్టుకు చివరి 10 ఓవర్లలో 144 పరుగులు ఇచ్చి తమ బౌలర్లు మ్యాచ్‌ను దూరం చేశారని చెప్పాడు కోహ్లి. తమ బౌలర్లు 20 పరుగులు కట్టడి చేసుంటే బాగుండేదని చెప్పాడు కెప్టెన్. బ్యాటింగ్ విషయంలో మాత్రం తమ జట్టు బాగా రాణించిందని చివరివరకు విజయంపై ధీమాగా ఉన్నామని చెప్పాడు విరాట్.

చివరి 5 ఓవర్లలో 85 పరుగులు సాధించడం పెద్ద విషయం కాకపోయినా ఆ చివరి క్షణాల్లో తమ మైండ్‌సెట్ చాలా ముఖ్యం అని అన్నాడు కోహ్లి. ఆరు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోవడంతో గేమ్ మొత్తం మారిపోయిందని కోహ్లి అన్నాడు. తొలి మ్యాచ్‌లో గెలిచి తాము ట్రాక్‌పైకి వచ్చినా అది ఈ మ్యాచ్‌ గెలుపుకు దోహదపడలేదని వాపోయాడు. తరువాత మ్యాచ్‌లలో మరింత మెరుగైన ప్రదర్శనను చూపిస్తామని ధీమా వ్యక్తం చేశాడు కోహ్లి.