క్రికెట్ చరిత్రనే మార్చేసిన ఒకే ఒక్క దేశవాళీ టోర్నమెంట్ ఐపీఎల్. 2008 లో ప్రారంభమైన ఈ ధనిక లీగ్, ఆటగాళ్లకు ఆర్థిక భద్రతను కలిపించింది. భారత్ ఉపఖండంలో కూడా క్రికెట్ కు సరికొత్త క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది ఐపీఎల్.

ఐపీఎల్ 11 వ ఎడిషన్ ప్రారంభం కాన్నుండటంతో ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ల జాబితా చూద్దాం.

#10. హర్భజన్ సింగ్- 5/18

భారత్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్న హర్భజన్, ముంబై ఇండియన్స్ కు అదే రీతిలో ఆడాడు. 2011 లో చెన్నై సూపర్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్ లో హర్భజన్ తన నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు తీసుకున్నాడు.

#9. ఆండ్రూ టై- 5/17

గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ లయన్స్ కు ఆడిన ఆండ్రూ టై, తన ఐపీఎల్ కెరీర్ లో మొదటి హాట్ట్రిక్ నమోదు చేసాడు. అయితే మ్యాచ్ లో కేవలం 17 పరుగులకే ఐదు వికెట్లు తీసాడు.

#8. అమిత్ మిశ్రా- 5/17

అతని లెగ్ స్పిన్ తో ఎందరినో ఆకట్టుకున్న అమిత్ మిశ్రా, మూడు ఐపీఎల్ హాట్ట్రిక్ లు సాధించిన ఏకైక బౌలర్. అతను తన కెరీర్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు డెక్కన్ ఛార్జర్స్ కు ప్రాతినిధ్యం వహించగా, ప్రతి జట్టుతోను హాట్ట్రిక్ సాధించడం గమనార్హం.

ఐతే తొలి ఐపీఎల్ సీజన్ లో డెక్కన్ ఛార్జర్స్ పై జరిగిన మ్యాచ్ లో అతను నిర్ణిత ఓవర్లలో ఐదు వికెట్లు తీసుకున్నాడు.

#7. జేమ్స్ ఫాల్కనేర్ – 5/16

2013 ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఆస్ట్రేలియా అల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనేర్, 28 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. చివరిలో సన్ రైజర్స్ పై జరిగిన ఎలిమినేటర్ లో చెలరేగిన ఫాల్కనేర్, ఐదు వికెట్లు తీసుకుని విజయం లో కీలక పాత్ర పోషించాడు.

#6. రవీంద్ర జడేజా- 5/16

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక సభ్యుడయ్యాడు రవీంద్ర జడేజా. నాలుగో ఎడిషన్ కు చెన్నై జట్టులో చేరిన జడేజా, తన తొలి సీజన్ లో వైజాగ్ లో డెక్కన్ ఛార్జర్స్ పై జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసుకున్నాడు.

#5. లసిత్ మలింగ- 5/13

ఐపీఎల్ రెండో సీజన్ లో తొలి సారి దక్షిణ ఆఫ్రికాలో మొదటి సారి ముంబై ఇండియన్స్ కు ఆడిన లసిత్ మలింగా, ప్రపంచంలోనే అత్యుత్తమ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా పేరు సాధించాడు. అతను 2011 సీజన్ లో కేవలం 16 మ్యాచ్లలో 28 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.

ఢిల్లీ డేర్ డెవిల్స్ పై జరిగిన మ్యాచ్ లో, అతను కేవలం 13 పరుగులు ఇచ్చి 3.4 ఓవర్లలో ఐదు వికెట్లు తీసాడు.

#4. ఇషాంత్ శర్మ- 5/12

2011 సీజన్లో అప్పట్లో ఉన్న కొచ్చి జట్టు పై ఇషాంత్ శర్మ తన వీరోచిత ఫామ్ ను కనరబరిచాడు. కేవలం మూడు ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు సాధించాడు, ఇషాంత్.

#3. అనిల్ కుంబ్లే – 5/5

2009 సీజన్ లో జరిగిన తొలి మ్యాచ్ లో అనిల్ కుంబ్లే, రాజస్థాన్ రాయల్స్ పై ఈ ఘనతను సాధించాడు. అతని సంచలన బౌలింగ్ కు రాజస్థాన్ బాట్స్మెన్ సమాధానం చెప్పలేకపోయారు. 3.1 ఓవర్లు వేసిన కుంబ్లే, 5 పరుగులకే 5 వికెట్లు తీయడం విశేషం.

#2. ఆడమ్ జాంపా- 6/19

2016 లో సన్ రైజర్స్ పై జరిగిన మ్యాచ్ లో ఆడమ్ జాంపా తన విశ్వరూపాన్ని చూపించాడు. తన నాలుగు ఓవర్లలో ఆరు వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసాడు.

#1. సోహైల్ తన్వీర్- 6/14

ఐపీఎల్ ప్రారంభమైన తొలి సీజన్ లో తన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్ ఉరూతలూగించాడు పాకిస్తాన్ స్పీడ్ బౌలర్, సోహైల్ తన్వీర్. కేవలం 11 మ్యాచులు ఆడిన తన్వీర్, 22 వికెట్లు తీసి అందరిని అబ్బురపరిచారు.

చెన్నై సూపర్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్ లో కేవలం 14 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఈ రికార్డు సృష్టించి 10 ఏళ్ళు అవుతున్న ఇంకా ఎవరు దానిని పగలగొట్టలేకపోయారు.

SHARE