Credits: BCCI

ఐపీఎల్ 2018 లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ సత్తా చాటి చెన్నై సూపర్ కింగ్స్ పై కీలక విజయం సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఆదిలోనే మంచి ఫామ్ కనబరుస్తున్న అంబటి రాయుడు వికెట్ను కోల్పోయారు. అయితే మూడవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సురేష్ రైనా, ఓపెనర్ షేన్ వాట్సన్ తో కలిసి జట్టు స్కోర్ను పరుగులెత్తించాడు.

ఈ ఇరువురు ఆలోచనతో కూడిన రిస్కులు తీసుకుంటూ జట్టు స్కోరును వేగంగా పెంచారు. అదే క్రమంలో సురేశ్ రైనా ఐపిఎల్ చరిత్రలో అయిదు వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్మన్ గా రికార్డు సృష్టించాడు. రెండవ వికెట్ కు 86 పరుగులు జోడించిన రైనా, వాట్సన్ వరుసగా అవుట్ కావడంతో చెన్నై జట్టు కాస్త కష్టాల్లోనే పడింది.

Credits: BCCI

అదే సమయంలో రాజస్థాన్ బౌలర్లు కూడా చక్కటి లైన్ మరియు లెన్త్తో బౌలింగ్ చేస్తూ చెన్నై పరుగుల తాకిడికి అడ్డుకట్ట వేశారు. చివరిలో ఎంఎస్ ధోని కాస్త వేగంగా పరుగులు చేసినప్పటికీ వారు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేశారు.

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు, ఓపెనర్ జాస్ బట్లర్ సంచలనమైన ఆరంభాన్ని అందించాడు. ఒకవైపు అతను ధాటిగా ఆడుతున్నప్పటికీ మరోవైపు నుంచి సరైన సహకారం లభించక రాజస్థాన్ జట్టు క్లిష్టమైన పరిస్థితిలో పడింది.

తొలి ఐదు ఓవర్లలోనే బెన్ స్టోక్స్ మరియు అజింక్య రహానే వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టు, తరువాత వచ్చిన సంజూ శాంసన్ కూడా పరుగులు వేగంగా చేయకపోవటంతో మరింత క్లిష్టమైన పరిస్థితుల్లో పడింది.

Jos Buttler of RR plays a shot during match forty three of the Vivo Indian Premier League 2018 (IPL 2018) between the Rajasthan Royals and the Chennai Super Kings held at the The Sawai Mansingh Stadium in Jaipur on the 11th May 2018.
Photo by: Rahul Gulati /SPORTZPICS for BCCI

పైగా వికెట్ కూడా మరింత మెల్లగా తయారవ్వడంతో పరుగులు చేయడం చాలా కష్టమైంది. చివరిలో బిన్ని మరియు కృష్ణప్ప గౌతమ్ వేగంగా పరుగులు చేయడం, జాస్ బట్లర్ దూకుడు జత కలవడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ముఖ్యమైన విజయం సాధించింది.

ఇంగ్లాండ్ ఓపెనర్ జాస్ బట్లర్ కేవలం 60 బంతుల్లో 95 పరుగులు చేసి ఒంటి చేత్తో రాజస్థాన్ జట్టుకు ఈ కీలక విజయం అందించాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా నాలుగు మ్యాచ్లలో నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్లో ఒకడయ్యాడు.

ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్ ఆశలు ఇంకా వారి చేతుల్లోనే ఉన్నాయి. వారు ఇకపై ఆడనున్న చివరి 3 మ్యాచ్ లలో విజయం సాధించగలిగితే ప్లే ఆఫ్ దశకు చేరడం కచ్చితంగా కనిపిస్తుంది.

SHARE