ఐపీఎల్ 2018 లో తొలి భాగంలో అంతగా రాణించని ముంబయి ఇండియన్స్, ఈ రోజు కోల్ కతా నైట్ రైడర్స్ పై జరిగిన కీలక మ్యాచ్‌లో ముఖ్యమైన విజయం సాధించింది.
వరుసగా పెద్ద జట్లు అయినా చెన్నై సూపర్ కింగ్స్ మరియు కింగ్స్ లెవెన్ పంజాబ్‌పై కీలక విజయాలు సాధించిన ముంబయి ఇండియన్స్, వరుసగా మూడో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకొన్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఓపెనర్లు ఎవిన్ లూయిస్, సూర్యకుమార్ యాదవ్ మంచి ఆరంభాన్ని అందించారు. అయితే కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు వరుసగా మూడు వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు సాధించారు.

చివరిలో క్రునాల్ పాండ్యా అంతగా ఆకట్టుకున్నప్పటికీ హార్థిక్ పాండ్యా మాత్రం వేగంగా పరుగులు చేసి జట్టు స్కోరును 180 పరుగులు దాటించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో వెస్ట్ ఇండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆదిలోనే ఓపెనర్లిద్దరూ ను కోల్పోయింది. అయితే మిడిలార్డర్లో వచ్చిన రాబిన్ ఉతప్ప మరియు నితీశ్ రాణా చక్కటి భాగస్వామ్యం నెలకొల్పి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును ముందుకు తీసుకువెళ్లారు.
వీరిరువురు మూడవ వికెట్‌కు ఏకంగా 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును మంచి స్థితికి తీసుకువెళ్లారు. అయితే మరోసారి ఈ ఇరువురూ వెనువెంటనే ఔట్ కావడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుంది.

Photo by: Vipin Pawar /SPORTZPICS for BCCI
తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ దినేష్ కార్తిక్ మరియు ఆండ్రీ రసెల్ చాలా ఇబ్బంది పడ్డారు. రసెల్ అవుట్ అయిన తరువాత దినేష్ కార్తీక్ పరుగుల వేగాన్ని పెంచాడు. కానీ సునీల్ నరైన్ ను ఆఖరి ఓవర్లలో పంపిన ప్లాన్ సరిగా పనిచేయకపోవటంతో, ముంబయి బౌలర్లు మంచి పట్టును సాధించారు.
ఆఖరి ఓవర్లలో ముంబయి బౌలర్లు చక్కటి కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. అయితే చివరి ఓవర్ క్రునాల్ పాండ్యాకు ఇచ్చి కొంత రిస్క్ చేసినప్పటికీ, ముంబయి ఇండియన్స్ మాత్రం చక్కటి విజయం సాధించి తమ ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకొన్నారు.