Photo Credit: IPL.

ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన కింగ్స్ లెవెన్ పంజాబ్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ లో కింగ్స్ సులువైన విజయం సాధించింది. క్రిస్ గేల్ మరియు కెఎల్ రాహుల్ భీకరమైన ఫామ్లో ఉండటంతో పంజాబ్ జట్టు భారీ స్కోరును అలవోకగా ఛేదించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ లిన్ తనదైన స్థాయిలో ప్రదర్శన చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. కేవలం 41 బంతుల్లో 74 పరుగులు చేసిన క్రిస్ లిన్, 4 సిక్సులు, 6 ఫోర్లు కొట్టాడు.

Photo Credit: IPL.

మిడిల్ ఆర్డర్ లో రాబిన్ ఉతప్ప మరియు దినేష్ కార్తిక్ కూడా చక్కగా రాణించారు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్ పై 191 పరుగుల స్కోరు మంచిగానే కనిపించింది. కానీ అతి భీకర ఫామ్లో ఉన్న క్రిస్ గేల్ మరియు కెఎల్ రాహుల్ను ఆపటం నైట్ రైడర్స్ బౌలర్లకు సులువు కాలేదు.

తొలి ఓవర్ లోనే కోల్కతా బౌలర్లపై విరుచుకుపడిన కేఎల్ రాహుల్ కు క్రిస్ గేల్ జోరు కూడా జత కట్టింది. తాను ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఒక అర్ధ శతకం, ఒక శతకం సాధించిన గేల్ అదే ఫామ్ ను కోల్ కతా నైట్ రైడర్స్ పైన కూడా చూపించాడు.

ఒకవైపు రాహుల్ మరోవైపు గేల్ ధీటుగా ఆడటంతో పరుగుల వరద పారింది. అయితే 8.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు 96 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం తన ఉనికిని చాటుకోగా మ్యాచ్ గంట పైగా ఆగిపోయింది. ఒకసారి మ్యాచ్ పునరుద్ధరణ జరిగిన తరువాత టార్గెట్ను పదమూడు ఓవర్లలో 125 పరుగులుగా నిర్ణయించారు. దీనితో పంజాబ్ జట్టు 28 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి వచ్చింది.

మ్యాచ్ మరలా ప్రారంభం అవగానే తొలి బంతిని శిక్షగా మరల్చి క్రిస్ గేల్ తన అర్ధ శతకం పూర్తి చేశాడు. రాహుల్ కూడా తన జోరును కొనసాగిస్తూ మరో అర్ధ శతకం కొట్టాడు. అయితే అదే జోరును కొనసాగిస్తూ మరో పెద్ద షాట్కు ప్రయత్నించిన రాహుల్ ఔట్ అయినప్పటికీ క్రిస్గేల్ చివర్లో సిక్స్ కొట్టి తనదైన శైలిలో మ్యాచ్ను ముగించాడు.