ఐపీఎల్ 2018 లో ఇప్పటివరకూ తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి కోల్ కతా నైట్ రైడర్స్ పై జరిగిన కీలక మ్యాచ్లో ఓటమి పాలైంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పవర్ ప్లే ఓవర్లను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఓపెనర్లు బ్రెండన్ మెక్కలం మరియు డి కాక్ మంచి భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ , వేగవంతంగా పరుగులు చేయలేకపోయారు.

అయితే పరుగుల వేగం పెంచే క్రమంలో బెంగళూరు జట్టు వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. కేవలం విరాట్ కోహ్లి మాత్రమే ఒక వైపు నుండి పరుగులు చేస్తుండగా మరోవైపు అతనికి సరైన సహకారం లభించలేదు. నాలుగో వికెట్కు మన్దీప్ సింగ్ తో కలిసి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లి, మన్దీప్ ఔట్ అయిన వెంటనే పరుగుల వేగం పెంచాడు.

కేవలం 44 బంతుల్లో 68 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ, తన ఇన్నింగ్స్ లో 3 సిక్సులు మరియు 5 ఫోర్లు బాదాడు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేశారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.

రెండవ ఇన్నింగ్స్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆరంభం నుండి తమ ఆధిపత్యం కనబరిచారు. ఓపెనర్లు సునీల్ నరైన్ మరియు క్రిస్ లిన్, చాలా తెలివిగా పరుగులు సాధిస్తూ తమ జట్టుపై ఎటువంటి ఒత్తిడి లేకుండా స్కోరును కదిలించారు.

తొలి వికెట్ కు యాభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన నైట్ రైడర్స్ జట్టు, పవర్ప్లే తర్వాత సునీల్ నరైన్ వికెట్ ను కోల్పోయింది. దీనితో క్రీజ్లోకి వచ్చిన రాబిన్ ఉతప్ప, చాలా వేగంగా పరుగులు చేయడంతో కోల్ కతా జట్టు విజయం వైపు అడుగులు వేసింది.

కానీ బెంగళూరు స్పిన్నర్లు మురుగన్ అశ్విన్ మరియు యజవేంద్ర చాహల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ మరోసారి ఉత్కంఠ భరితంగా మారింది. కానీ కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తిక్ చాలా వేగంగా ఇరవై మూడు పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

ఈ విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్ లలో 8 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మరోవైపు బెంగళూరు జట్టు ఇకపై ఆడనున్న ఏడు మ్యాచ్ లలో కనీసం 6 విజయాలు సాధించాలి.