Credits: BCCI

ఐపిఎల్ 2018 లో వరుసగా మూడు విజయాలు సాధించి మంచి జోరుమీద ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, కచ్చితంగా గెలవాల్సిన చివరి ఆటలో రాజస్థాన్ జట్టు చేతిలో భారీ పరాజయంతో ఈ ఏడాది సీజన్ నుండి వైదొలిగారు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రెండవ ఓవర్లో ఆర్చర్ అవుట్ కావటంతో క్లిష్టమైన పరిస్థితిలో పడింది. అయితే తర్వాత బ్యాటింగ్కు వచ్చిన అజింక్య రహానే, ఓపెనర్ రాహుల్ త్రిపాఠితో కలిసి రెండవ వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

మరోసారి ఉమేష్ యాదవ్ విజృంభించి వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో రాజస్థాన్ జట్టు వేగానికి అడ్డుకట్ట వేయగలిగాడు. సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్లాసన్ వేగంగా పరుగులు చేయడంతో చివరిలో విలువైన పరుగులు లభించాయి. దీనితో వారు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేశారు.

Credits: BCCI

రాజస్థాన్ బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠి అజేయమైన 80 పరుగులు చేయగా, బెంగళూరు బౌలర్లలో ఉమేష్ యాదవ్ మూడో వికెట్లు తీసి అలరించాడు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశ పరచగా తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఏబీ డివిలియర్స్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. పార్థివ్ పటేల్తో కలిసి డివిలియర్స్ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఇరువురు రెండవ వికెట్కు యాభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి బెంగళూరు జట్టును మంచి స్థితికి తీసుకువెళ్లారు.

అయితే ఒకసారి పార్థివ్ పటేల్ అవుట్ అయిన తరువాత బెంగళూరు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ ఎవరూ సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. దీనితో డివిలియర్స్ కు సరైన మద్దతు ఎవరూ ఇవ్వలేకపోయారు.

Credits: BCCI

కేవలం 32 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయి రాయల్ చాలెంజర్స్ మ్యాచ్ కోల్పోయింది. చివరిలో బౌలర్లు టిమ్ సౌథీ మరియు మహమ్మద్ సిరాజ్ రెండంకెల స్కోరు అందుకోవటంతో జట్టు 134 పరుగులకు ఆల్అవుట్ అయ్యింది.

బెంగళూరు బ్యాట్స్మన్ లో ఏబీ డివిలియర్స్ అర్ధసెంచరీ చేయగా, రాజస్థాన్ బౌలర్లలో స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ ఏకంగా నాలుగు వికెట్లు తీసి బెంగళూరు బ్యాటింగ్ వెన్ను విరిచాడు. ఈ మ్యాచ్ లో విజయంతో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫై కావడానికి దాదాపు వారి వంతు ప్రయత్నం పూర్తి చేశారు. అయితే ఆదివారం జరగనున్న మరో రెండు మ్యాచ్లలో ఫలితాలపై వారి క్వాలిఫికేషన్ ఆధారపడి ఉంటుంది.

SHARE