ఐపీఎల్ 2018లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టీమ్ మరోసారి తడబడటంతో ప్రత్యర్థి చేతిలో 19 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. రాజస్థాన్ జట్టు విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో చెలరేగి ఆడింది. సంజూ శాంసన్ 92 పరుగుల నాటౌట్‌తో బెంగళూరు బౌలర్లను చితకొట్టాడు.

టాస్ ఓడినప్పటికీ బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చూపించిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 217 పరుగులు సాధించింది. ఓపెనర్లు ఆజింక్యా రహానే 36(20 బంతుల్లో), డీఆర్సీ షాట్ 11(17 బంతుల్లో) 49 పరుగుల భాగస్వామ్యం అందించారు. తరువాత వచ్చిన సంజూ శాంసన్ 92 నాటౌట్(45 బంతులు 2×4, 10×6) చెలరేగి ఆడటంతో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెన్‌స్టోక్స్‌ 27, జోస్‌ బట్లర్‌ 23, త్రిపాఠి 14 పరుగులతో రాజస్థాన్ జట్టు స్కోరు నిర్ణీత ఓవర్లలో 217 పరుగులకు చేరుకుంది. బెంగళూరు బౌలర్లు క్రిస్ వోక్స్, చహాల్ చెరో రెండు వికెట్లు తీసారు.

218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఓవర్‌లోనే మెక్‌కలమ్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తరువాత క్వింటన్‌ డి కాక్ (26)తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లి(57) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ వికెట్లు పడకుండా మాత్రం వారు ఆపలేకపోయారు. క్వింటన్ డి కాక్, కోహ్లిలు ఔట్ అయిన తరువాత డివిలియర్స్(20), మన్‌దీప్ సింగ్(47 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(35) పరుగలతో రాణించారు. అయినా ఓటమి నుండి మాత్రం వారు తమ జట్టును కాపాడలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 6 వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే సాధించింది. రాజస్థాన్ బౌలర్స్‌లో శ్రేయాస్ గోపాల్ 2 వికెట్లు తీయగా డీఆర్సీ షాట్, కృష్ణప్ప గౌతమ్, బెన్ స్టోక్స్, బెన్ లాఫ్లిన్ తలో వికెట్ తీసి తమ జట్టును గెలిపించారు.