ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణి కొట్టింది. రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు అన్ని విభాగాల్లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు తొలుత బౌలింగ్‌కు దిగింది. మొదటి ఓవర్‌లోనే రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన ముంబైను కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గట్టేక్కించాడు రోహిత్ శర్మ.

టాస్ ఓడిన ముంబై ఇండియన్స్‌కు మొదటి రెండు బంతుల్లోనే నష్టం జరిగింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు ఇద్దరు డకౌట్‌లుగా వెనుదిరిగారు. వీరి తరువాత ఎవిన్ ల్యూయిస్‌తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలో 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎవిన్ ల్యూయిస్ అవుట్ కావడంతో జట్టు బాధ్యతను రోహిత్ తీసుకున్నాడు. చాలా వీరోచితంగా ఆడి 94 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ముంబై స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ముందుంచారు ముంబై ఇండియన్స్. బెంగళూరు బౌలర్లలో ఉమేష్ యాదవ్, కోరి ఆండర్సన్ చెరో రెండు వికెట్లు తీయగా క్రిస్ వోక్స్ 1 వికెట్ తీశాడు.

ముంబై తమ ముందుంచిన 213 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బెంగళూరు జట్టుకు బాసటగా నిలిచాడు కెప్టెన్ విరాట్ కోహ్లి. తనదైన స్టయిల్లో బ్యాటింగ్ చేస్తూ బెంగళూరు జట్టును విజయానికి చేరువగా తీసుకెళ్లాడు విరాట్. క్వింటన్ డి కాక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కోహ్లి 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ బెంగళూరు జట్టు వరుసగా తమ వికెట్లను కోల్పోవడం మొదలుపెట్టింది. క్వింటన్ డి కాక్ (19), మన్దీప్ సింగ్ (16), క్రిస్ వోక్స్ (11) తప్పితే మరే ఇతర బ్యాట్స్‌మెన్ రెండు అంకెల స్కోరు చేయలేకపోయారు. కేవలం కోహ్లి మాత్రమే 92 పరుగులు చేసి నాటౌట్‌గా నలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయడంతో ఓటమి పాలయ్యింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కృణాల్ పాండ్యా 3 వికెట్లు తీయగా బుమ్రా, మిచెల్ మెక్‌క్లెనగన్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఇలా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మంచి ఆటతీరును ప్రదర్శించిన రోహిత్ శర్మ ఎట్టకేలకు తన జట్టుకు ఒక మంచి విజయాన్ని అందించాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో వరుసగా ఓటమి పాలయ్యి విమర్శలు ఎదుర్కున్న ముంబై ఎట్టకేలకు ఈ ఏడు ఐపీఎల్‌లో బోణి చేసింది.