ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మూడో ఐపీఎల్ మ్యాచ్ లో ఆతిథ్య కోల్ కతా నైట్ రైడర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును భారీ తేడాతో ఓడించింది

తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దినేశ్ కార్తిక్ నిర్ణయం సరైనదే అని నిరూపిస్తూ పియూష్ చావ్లా ఇన్నింగ్స్లో రెండో ఓవర్ లో క్వింటన్ డికాక్ వికెట్ ను తీశాడు. అయితే తరువాత బ్రెండన్ మెక్కలం, విరాట్ కోహ్లీ చక్కటి పార్ట్నర్ షిప్ నెలకొల్పి జట్టును మంచి స్థితికి తీసుకువెళ్లారు.

మెక్కలం అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ ఎప్పటిలానే తన అద్భుతమైన పవర్ హిట్టింగ్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అయితే యువ ఆటగాడు నితీశ్ రాణా ఒకే ఓవర్లో ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ ఇద్దరి వికెట్లు తీయడంతో మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ వైపు మళ్లింది. కానీ చివరిలో మందీప్ సింగ్ చక్కటి ఇన్నింగ్స్ ఆడటంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేశారు.

కోల్కతా బౌలర్లలో నితీశ్ రాణా సంచలనంగా రాణించగా, మిచెల్ జాన్సన్ మరియు సునీల్ నరేన్ కూడా ఫర్వాలేదు అనిపించారు. 177 టార్గెట్ తో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ కు రెండో ఓవర్లోనే క్రిస్ లిన్ ను కోల్పోవడం, మ్యాచ్ ను కాస్త రాయల్ చాలెంజర్స్ వైపు తిప్పింది.

అయితే సునీల్ నరేన్ మరోసారి తన బ్యాట్ జూలు విదల్చడంతో కేవలం 19 బంతుల్లో 50 పరుగులు చేసి వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 5 సిక్సులు ఉండటం విశేషం. అయితే అతను అవుట్ అయ్యే సమయానికి మ్యాచ్ ను తన జట్టు వైపు తిప్పడంతో తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఒత్తిడి లేకుండా ఆడారు.

నితీష్ రానా మెరుపులు మెరిపించగా, కెప్టెన్ దినేష్ కార్తిక్ చివరి వరకు ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతను 29 బంతుల్లో అజేయమైన 35 పరుగులు చేశాడు.

ఒక వికెట్ మరియు వేగమైన అర్ధ సెంచరీ సాధించిన సునీల్ నరైన్ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేశారు. బెంగళూరు బౌలర్లలో క్రిస్ వోక్స్ మూడు వికెట్లు ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసుకున్నాడు.