ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఐపీఎల్ 2018లో బోణి కొట్టింది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచులు ఓడి పలు విమర్శలను ఎదుర్కున్న ముంబై జట్టు వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడిన మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరుతో గెలిచింది. టాస్ ఓడినప్పటికీ జట్టులో ఉత్సాహాన్ని నింపి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు రోహిత్ శర్మ.

‘‘ఈ మ్యాచ్‌లో మా ఓపెనింగ్ అంత బాగాలేదు. తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోవడం నిజంగా ఆందోళనకు గురిచేసింది. కానీ ఎలాంటి ఒత్తిడికి లోనవుకుండా మా జట్టును గెలిపించాలనే పట్టుదలతోనే ఆడటం జరిగింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు పిచ్ బ్యాటింగ్‌కు మొదట్లో సహకరించలేదు. దీంతో క్రీజులో ఎలాగైనా నిలదొక్కుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఇక ఎప్పుడైతే బంతి బ్యాట్‌పైకి వస్తుందో అప్పుడే మనం షాట్ కొట్టడానికి వీలుంటుంది. ఇవాల్టి మ్యాచ్‌లో కూడా ఇదే జరిగింది. ఆచితూచి మంచి బంతి వచ్చినప్పుడు దానిని బౌండరీకి పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఓడిపోయాము.. కానీ మా జట్టు ప్లేయర్లు మంచి క్రికెట్‌ను ఆడారు. ల్యూయిస్‌తో కలిసి ఒక మంచి భాగస్వామ్యం నెలకొల్పడానికి ప్రయత్నించాను. అతడు ఒక్కసారి బంతిని కొట్టడం స్టార్ట్ చేస్తే అతడిని ఆపడం కష్టం.’’ అని చెప్పాడు రోహిత్.

‘‘నేను ఏస్థానంలో బ్యాటింగ్‌కు వస్తే మంచి జరుగుతుందో అదే సమయంలో జట్టు మిగతా సభ్యుల అంగీకారంతోనే బ్యాటింగ్‌కు దిగుతాను. ఈ మ్యాచ్ ఇచ్చిన విజయోత్సాహం ముందు మ్యాచుల్లో కూడా కొనసాగిస్తాం.’’ అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

SHARE