ఐపీఎల్ 2018 లో చక్కటి ప్రారంభం సాధించిన కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనున్నారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది.

శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ఇరు జట్లకు ముఖ్యమే.

పిచ్ రిపోర్టు

కోల్ కతా పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. పియూష్ చావ్లా సునీల్ నరైన్ కుల్దీప్ యాదవ్ లతో కోల్‌కతా స్పిన్ విభాగం చాలా గట్టిగా ఉంది. అలానే పంజాబ్ జట్టులో కూడా అఫ్గాన్ స్పిన్నర్ ముజీబ్ రెహమాన్, రవిచంద్రన్ అశ్విన్ కూడా బాగానే రాణిస్తున్నారు.

ఈసారి కూడా కోల్‌కతా పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ మరింత మెల్లగా అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

టాస్ గెలిస్తే?

పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించడంతో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేయడం మంచి నిర్ణయంగా కనిపిస్తుంది.

రెండో ఇన్నింగ్స్ లో బాల్ మరింత మెల్లగా రావటంతో బ్యాట్స్‌మెన్‌కు షాట్లు ఆడే అవకాశం సరిగ్గా ఉండదు. పైగా మ్యాచ్ రాత్రి కాకపోవటంతో మంచు బౌలింగ్‌పై ప్రభావితం అంతగా చూపించదు.

హెడ్ టు హెడ్ రికార్డు

ఇప్పటివరకు కోల్ కతా నైట్ రైడర్స్ మరియు కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు 21 ఆటల్లో పాల్గొన్నారు. అయితే వీటిలో కోల్ కతా నైట్ రైడర్స్ 14 విజయాలు సాధించగా, కింగ్స్ లెవెన్ పంజాబ్ 7 విజయాలు తమ పేరున నమోదు చేసుకుంది.

కానీ కింగ్స్ లెవెన్ పంజాబ్ రికార్డు ఈడెన్ గార్డెన్స్ లో మరింత అధ్వానంగా ఉంది. వారు ఆడిన 9 ఆటల్లో కేవలం 2 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించారు.

కీలక ప్లేయర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో ముఖ్యమైన ఆటగాడు సునీల్ నరైన్. అతను బంతితో తన మాయాజాలం చూపించగా, బ్యాట్ జూలు విదల్చడంతో దిట్ట. అతని ఫామ్ పైనే కోల్‌కతా విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

ఈ ఏడాది ఐపిఎల్‌లో క్రిస్ గేల్ మరోసారి తన సంచలన ఫామ్ ను కనబరిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై ఈ ఏడాది ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన గేల్ తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ సాధించాడు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై జరిగిన మ్యాచ్‌లో ఏకంగా అజేయమైన సెంచరీ సాధించి రికార్డు పుస్తకాల్లోకి మరోసారి తన పేరు లిఖించుకున్నాడు.

మ్యాచ్ అంచనా

కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు చాలా చక్కటి ఫామ్‌లో ఉన్నప్పటికీ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును వారి సొంత గడ్డపై ఓడించడం చాలా క్లిష్టమైన పని. క్రిస్‌గేల్ తన బ్యాట్‌కు మరోసారి పని చెప్తే పంజాబ్ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ అతను సరిగ్గా ఆడలేకపోతే కోల్ కతా జట్టు మరో సులువైన విజయం సాధిస్తుంది.