ఐపీఎల్‌ 2018లో భాగంగా మరికొద్దిసేపట్లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తమ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో రసవత్తరమైన పోరులో తలపడేందుకు అన్నివిధాలా రెడీ అయ్యింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన కోల్‌కత్తా ఈ ఆటలో ఎలాగైనా విజయం సాధించాలనే కసితో తమ స్ట్రాటజీ సెట్ చేసుకుంటోంది.

ప్రత్యర్థి జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై కోల్‌కత్తా గత రికార్డులు ఈ జట్టుకు బలాన్ని చేకూర్చనున్నాయి. దీంతో పాటు హోమ్‌గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎలాగూ ఉండనే ఉంది. అయితే ఈ జట్టును కలవరపెడుతున్న విషయం మాత్రం ఒకటి ఖచ్చితంగా ఉంది. గతంలో కోల్‌కత్తా జట్టుకు కెప్టెన్‌గా ఆడిన గౌతమ్ గంభీర్‌ ఈసారి ఢిల్లీ జట్టు ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఈ గ్రౌండ్‌లో అతడికి ఉన్న రికార్డు మరే ఇతర ఆటగాడికి లేకపోవడం విశేషం.

మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టును తమ హోమ్‌గ్రౌండ్‌లో ఓడించి కావాల్సినంత కాన్ఫిడెంట్‌తో కోల్‌కత్తాలో అడుగుపెట్టింది. ఈడెన్ గ్రౌండ్స్‌లోనూ ముంబై తరహా రిజల్ట్ పునరావృతం అవుతుందని భావిస్తున్నారు గంభీర్ అండ్ టీమ్. అయితే తమ బలం అంతా తమ బౌలర్లే అని చెప్పే కోల్‌కత్తా కెప్టెన్ దినేష్ కార్తీక్ ఈ మ్యాచ్‌లోనూ వారు చెలరేగి ఆడుతారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఈ రెండు జట్లలోనూ విధ్వంసకర బ్యాట్స్‌మెన్లు ఉండటం విశేషం. కోల్‌కత్తా జట్టులో క్రిస్ లిన్, సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్ లాంటి వారు తమ సత్తా చాటుకునేందుకు రెడీగా ఉండగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లో జేసన్ రాయ్, గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శ్రేయాస్ అయ్యర్ వంటి హార్డ్‌-హిట్టర్లు ఉన్నారు. దీంతో ఈ పోరులో పరుగుల వరద ఖాయం అని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.

SHARE