ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రసవత్తరమైన పోరు జరిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఏ అంశంలోనూ రాణించలేకపోవడంతో హోమ్ టీమ్ కోల్‌కత్తా చేతిలో ఓటమి పాలయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

కేకేఆర్ బ్యాటింగ్‌లో దినేష్ కార్తీక్ 19 పరుగల వ్యక్తిగత స్కారు వద్ద ఔట్ కావడంతో ఆ తరువాత వచ్చిన ఆండ్రూ రస్సెల్ మరో బ్యాట్స్‌మెట్ నితీష్ రానాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరి బాదుడుతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించడమే కాకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే నితీష్ రానా హాఫ్ సెంచరీ కూడా చేశాడు. రస్సెల్ ఔట్ అయిన తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు క్రిస్‌ లిన్‌(31), రాబిన్‌ ఉతప్ప(35) పర్వాలేదనిపించారు. దీంతో కోల్‌కత్తా జట్టు స్కోరు 200కు చేరింది. ఢిల్లీ బౌలర్లలో రాహుల్ 3 వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్, క్రిస్ మారిస్ తలో రెండు వికెట్లు తీశారు. షమీ, నదీంలు చెరో వికెట్‌ తీసారు.

ఇక ఢిల్లీ జట్టు 201 పరుగుల లక్ష్యఛేదనలో ఎలాంటి మెరుపులు లేకపోవడంతో కేవలం 14.2 ఓవర్లకే చాపచుట్టేశారు. గంభీర్ గ్యాంగ్‌లో రిషబ్‌ పంత్‌(43‌), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(47) తప్పితే మరే ఇతర బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును చేయలేకపోయాడు. దీంతో ఢిల్లీ జట్టు కేవలం 129 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. కేకేఆర్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌ తలో మూడు వికెట్లు సాధించగా, పీయూష్‌ చావ్లా, రస్సెల్‌, శివం మావి, టామ్‌ కుర్రాన్‌లు తలో వికెట్‌ తీయడంతో కేకేఆర్ జట్టు విజయఢంకా మోగించింది.

SHARE