క్రికెట్ చరిత్రనే మార్చేసిన ఒకే ఒక్క దేశవాళీ టోర్నమెంట్ ఐపీఎల్. 2008 లో ప్రారంభమైన ఈ ధనిక లీగ్, ఆటగాళ్లకు ఆర్థిక భద్రతను కలిపించింది. భారత్ ఉపఖండంలో కూడా క్రికెట్ కు సరికొత్త క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది ఐపీఎల్.

ఐపీఎల్ 11 వ ఎడిషన్ ప్రారంభం కాన్నుండటంతో ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#5. డ్వైన్ బ్రేవో – 122 వికెట్లు 

తన ఐపీఎల్ కెరీర్ ను ముంబై ఇండియన్స్ తో ప్రారంభించిన బ్రేవో, తరువాత చెన్నై సూపర్ కింగ్స్ కు మారాడు. ఐతే తొలుత బాటింగ్ తో పాటు ఐదో బౌలర్ గా ఉపయోగపడుతూ వచ్చిన బ్రేవో, చెన్నై కు వచ్చిన తరువాత టీ 20 క్రికెట్లో అత్యుత్తమ డెత్ బౌలర్లలో ఒకడి గా మారాడు.

అతనికి ఆఖరి ఎనిమిది ఓవర్లలో నాలుగు ఓవర్లు ధోని ఇచ్చేవాడు అంటే అతని స్థాయి ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు. తన ఐపీఎల్ కెరీర్ లో 122 వికెట్లు తీసుకున్నాడు బ్రేవో.

#4. పీయూష్ చావ్లా- 126 వికెట్లు

భారత్లో ఉన్న ఎందరో స్పిన్నర్లలో ఒకడిగా ఉండే పీయూష్ చావ్లా, ఐపీఎల్ లో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక పేరు సాధించాడు. తొలుత కింగ్స్ XI పంజాబ్ జట్టుకు ఆడిన చావ్లా, తరువాత కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడాడు.

ఐతే గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ లో పుంజుకున్న చావ్లా, కోల్ కతా నైట్ రైడర్స్ చరిత్రలో గెలిచినా రెండు ఐపీఎల్ ట్రోఫీలలోను కీలక పాత్ర పోషించాడు. తన ఐపీఎల్ కెరీర్ లో 129 మ్యాచ్ లు ఆడిన చావ్లా, 126 వికెట్లు తీసి నాలుగో స్థానంలో ఉన్నాడు.

 #3. హర్భజన్ సింగ్ – 127 వికెట్లు 

తొలి ఐపీఎల్ సీజన్ నుండి ముంబై ఇండియన్స్ కు ఆడిన హర్భజన్ సింగ్, వారు గెలిచినా మూడు ఐపీఎల్ ట్రోఫీలలోను ముఖ్య భూమిక వహించాడు. కేవలం బంతితోనే కాకుండా వీలున్నప్పుడు బాట్ తో కూడా కొన్ని మ్యాచ్లను అనూహ్యంగా గెలిపించాడు ఈ పంజాబీ స్పిన్ దిగ్గజం.

భారత్ క్రికెట్లోనే అత్యుతమ స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్న హర్భజన్ సింగ్, ఐపీఎల్ లో కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా మంచి ప్రదర్శనలు చేస్తూ 127 వికెట్లు సాధించాడు.

#2. అమిత్ మిశ్రా – 134 వికెట్లు

భారత్ క్రికెట్లో ఎప్పుడు పిలిచినా బాచి మంచి ప్రదర్శనలు చేసే అమిత్ మిశ్రా, ఐపీఎల్ లో మాత్రం దిగ్గజ స్థాయిలో ఉన్నాడు. అతని లెగ్ స్పిన్ తో ఎందరినో ఆకట్టుకున్న అమిత్ మిశ్రా, మూడు ఐపీఎల్ హాట్ట్రిక్ లు సాధించిన ఏకైక బౌలర్.

అతను తన కెరీర్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు డెక్కన్ ఛార్జర్స్ కు ప్రాతినిధ్యం వహించగా, ప్రతి జట్టుతోను హాట్ట్రిక్ సాధించడం గమనార్హం. అతను ఇప్పటి వరకు 134 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు.

#1. లసిత్ మలింగ- 154 వికెట్లు 

ఐపీఎల్ రెండో సీజన్ లో తొలి సారి దక్షిణ ఆఫ్రికాలో మొదటి సారి ముంబై ఇండియన్స్ కు ఆడిన లసిత్ మలింగా, ప్రపంచంలోనే అత్యుత్తమ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా పేరు సాధించాడు.

అతను ఆఖరి ఓవర్లలో నిరంతరాయంగా వేసే యోర్కర్ లకు బాట్స్మెన్ సమాధానం చెప్పడానికి చాలా కాస్త పడ్డారు. అయితే గత ఏడాది పెద్దగా ఆడని మలింగా, ఈ ఐపీఎల్ నుండి ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్ గా వ్యవహరించనున్నాడు. అతను అందరికంటే ఎక్కువగా కేవలం 110 మ్యాచ్ లలో 154 వికెట్లు తీసాడు.

SHARE