ఈ ఏడాది జరిగే ఐపీఎల్ ఎలా అయిన బాగా ఆడాలి అనే గట్టి పట్టుదల ఉన్న జట్లలో కింగ్స్ XI పంజాబ్ ఒకటి. ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవని ఈ ఫ్రాంచైజ్ ఒకే ఒక సారి 2014 లో ఫైనల్స్ వరకు వెళ్ళింది.

ఐతే ఆక్షన్ లో మంచి బాట్స్మెన్ మరియు బౌలర్లను కొన్న పంజాబ్ జట్టు, సరైన వికెట్ కీపర్ ను కొనలేదు అని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ కింగ్స్ XI పంజాబ్ కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విమర్శల పై సమాధానం చెబుతూ, తన జట్టులో బాగా కీపింగ్ చేసే ఆటగాడు లేడని కానీ వారు మ్యాచ్లు గెలిచే జట్టు పై ద్రుష్టి పెట్టినట్టు చెప్పుకొచ్చాడు.

ఫేస్ బుక్ లైవ్ లో అభిమానులతో మాట్లాడానికి వచ్చిన సెహ్వాగ్, పంజాబ్ జట్టుకు భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కెప్టెన్ గా కూడా ప్రకటించాడు. అయితే చాలా మంది పంజాబ్ స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ ను కెప్టెన్సీ పగ్గాలు ఇస్తారు అని భావించగా, సెహ్వాగ్ మాత్రం అశ్విన్ వైపే మొగ్గు చూపాడు.

జట్టులో అనుభవానికి పెద్ద పీట వేసిన సెహ్వాగ్, యువరాజ్ సింగ్, క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, కే ఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి మంచి ఆటగాళ్ళని కొనుగోలు చేశారు. అయితే తమ జట్టులో వికెట్ కీపర్ సమస్య లేదని సెహ్వాగ్ తన ఫేస్ బుక్ లైవ్ లో చెప్పాడు.

“మన అభిమానులు మన జట్టు లో వికెట్ కీపర్లు లేరు అని అనుకుంటున్నారు. అయితే కే ఎల్ రాహుల్, అక్షదీప్ నాధ్ కీపింగ్ బాధ్యతలు ఇదివరకే చేసారు,” అని సెహ్వాగ్ చెప్పాడు.

అయితే నూతన కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ రాహుల్ తో కీపింగ్ బాధ్యతలపై మాట్లాడాడని, రాహుల్ కూడా కీపింగ్ చేసేందుకు ఎటువంటి అసమ్మతిని చూపలేదని, సెహ్వాగ్ అన్నాడు. అక్షదీప్ నాధ్ కూడా రంజీ ట్రోఫీ లో ఉత్తర్ ప్రదేశ్ కు కీపింగ్ చేసాడు అని గుర్తు చేసాడు సెహ్వాగ్.

SHARE