Photo Credit: IPL.

ఐపీఎల్ 2018 రెండవ భాగం చాలా ఉత్కంఠగా మారింది. ఒకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ దశకు క్వాలిపై అవ్వగా, మరో మూడు స్థానాల కోసం ఏకంగా ఆరు జట్లు తలపడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా దాదాపు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉండటంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది.

శనివారం ఇండోర్లో జరగనున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కచ్చితంగా విజయం సాధిస్తేనే వారి ప్లే ఆఫ్ ఆశలు నిలబడతాయి. మరోవైపు కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ దశకు మరొక అడుగు దగ్గర అవుతారు.

పిచ్ రిపోర్టు

ఇండోర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ మరో సారి బాటింగ్ కు బాగా అనుకూలించనుంది. సాధారణంగా 180 పరుగుల సగటు స్కోరు ఉన్న ఈ గ్రౌండ్ లో బౌలర్లకు అంత సహకారం లేకపోవడం గమనార్హం.

అయితే గ్రౌండ్ కూడా చాలా చిన్నది అవ్వడంతో పరుగులు గట్టిగా పారడం ఎప్పుడు సాధారణ విషయమే. మరోసారి బ్యాటింగ్కు అనుకూలమైన వికెట్ ఈ మ్యాచ్ లో ఉంటుందని భావించవచ్చు.

టాస్ గెలిస్తే?

టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బౌలింగ్ చేయడానికి ఇష్టపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మ్యాచ్ జరిగినంత సమయం పిచ్ పెద్దగా మారక పోవటమే ఇందుకు ప్రధాన కారణం.

పైగా గ్రౌండ్ బాగా చిన్నది కావడంతో బౌండ్రీలు సాధించడం చాలా తేలిక దీనితో చేజింగ్ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండు జట్లకు మంచి బాట్స్మన్ ఉండటంతో ఈ మ్యాచ్ మరో సారి ఉత్కంఠంగా ఉండటం ఖాయం గా కనిపిస్తుంది.

హెడ్ టు హెడ్ రికార్డు

ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఐపిఎల్ చరిత్రలో 22 సార్లు తలపడ్డాయి. కోల్ కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ లలో 14 విజయాలు సాధించగా, పంజాబ్ జట్టు మాత్రం కేవలం ఎనిమిది విజయాలతో సరిపెట్టుకుంది.

మరోవైపు పంజాబ్ తో పంజాబ్ సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఏడు విజయాలు సాధించగా, ఐదు పరాజయాలు కూడా మూటకట్టుకుంది. ఈ రెండు జట్లు తొలిసారి ఇండోర్లో తలపడనున్నారు.

కీలక ఆటగాళ్లు

కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు ఓపెనర్లు కెఎల్ రాహుల్ మరియు క్రిస్ గేల్ సంచలనమైన ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. అయితే ముఖ్యంగా కోల్ కతా జట్టుపై అద్భుతమైన రికార్డు కలిగిన ఏకైక ఆటగాడు క్రిస్ గేల్.

అతను ఇప్పటి వరకూ కోల్ కతా జట్టుపై 14 ఇన్నింగ్స్ ఆడగా, అందులో ఏకంగా 594 పరుగులు చేశాడు. అంతే కాకుండా మొత్తం నాలుగు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.

అలానే కోల్కతా నైట్రైడర్స్ జట్టులో కీలకం కానున్నాడు స్పిన్నర్ సునీల్ నరైన్. ముఖ్యంగా క్రిస్ గేల్ ను కట్టడి చేయగలిగే అరుదైన బౌలర్లలో సునీల్ నరైన్ ఒకడు. అతను ఇప్పటి వరకూ గేల్ ను అయిదు సార్లు ఔట్ చేయగా, వేసిన 119 బంతుల్లో కేవలం 94 పరుగులు ఇచ్చాడు.

దీనితో ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు సునీల్ నరైన్ కీలకం కానున్నాడు.

మ్యాచ్ అంచనా

తొలి అర్ధ భాగంలో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు సంచలనమైన ఫాం కనబరిచింది. అయితే గత మూడు నాలుగు మ్యాచ్లలో వారి నిలకడ అంత గొప్పగా లేదు. మరోవైపు కోల్ కతా జట్టు కూడా పెద్దగా ప్రశంసనీయమైన ప్రదర్శనలు చేసిన దాఖలాలు లేవు. దీనితో కింగ్స్ లెవన్ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

SHARE