చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ మంగళవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరగనున్న మ్యాచ్కు అందుబాటులో ఉండటం సందేహంగానే ఉంది. అతను ఇటీవలే ఆస్ట్రేలియాపై జరిగిన టెస్ట్ సిరీస్ లో వేలికి గాయం చేసుకోవడంతో ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేకపోయాడు.

ఇదే కారణం వలన అతను తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ పై జరిగినప్పుడు కూడా ఆటలో భాగస్వామి కాలేక పోయాడు. అయితే ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ కేదార్ జాదవ్ ఐపీఎల్ సీజన్ నుండి గాయం కారణంగా అందుబాటులో లేకపోవటం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చాలా పెద్ద నష్టం.

అతను ముంబై ఇండియన్స్ పై జరిగిన మ్యాచ్ లో హ్యామ్స్ట్రింగ్ గాయం పాలయ్యాడు. దీనితో ధోనీకి మిడిల్ ఆర్డర్లో ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడానికి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫాఫ్ డు ప్లెసిస్ కూడా అందుబాటులో లేకపోవడంతో తరువాత కోల్ కతా తో జరిగే మ్యాచ్ లో ధ్రువ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

అలానే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మురళీ విజయ్ ను ఓపెనర్ గా పంపించి షేన్ వాట్సన్ ను మిడిలార్డర్ లోకి తీసుకువచ్చే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి.

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరగనున్న మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్కు చాలా ముఖ్యమైనది. వారు రెండు సంవత్సరాల తర్వాత నిషేధం పూర్తి చేసుకుని ఆడుతున్న తొలి ఐపీఎల్ మ్యాచ్. చెన్నై సూపర్ కింగ్స్ లేని రెండు సంవత్సరాలు చెన్నైలో ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా జరగలేదు.

అయితే కేదార్ జాదవ్ స్థానంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లే ను తీసుకోవటానికి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అతనితో ఒప్పందం చాలా దగ్గరగా ఉండటంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.

SHARE