కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్ రసవత్తర పోరులో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుపై 71 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు. దినేష్ కార్తీక్ నేతృత్వంలోని జట్టు అన్ని విభాగాల్లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించడంతో ప్రత్యర్థి జట్టుపై అలవోకగా గెలిచారు. ఈ మ్యాచ్‌ గెలవడంతో తమ ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని అన్నాడు కెప్టెన్ దినేష్ కార్తీక్.

తమ జట్టు ప్లేయర్లు ఆచితూచి తమ మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తున్నారని.. తమ జట్టులో అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారని, వారు చాలా తెలివిగా బౌలింగ్ చేశారని దినేష్ కార్తీక్ చెప్పాడు. ఢిల్లీ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ అయ్యర్ ఔట్ అయినప్పుడు తమ జట్టు ఒక ప్లాన్ ప్రకారం వెళ్లాలని నిర్ణయించుకుంది. అందులో వారు పూర్తిగా సక్సెస్ కావడంతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ పెద్ద స్కోరు చేయకుండా నియంత్రించగలిగామని అన్నాడు దినేష్.

ఇలాంటి విజయం సాధించినప్పుడు కెప్టెన్‌గా చాలా మంచి అనుభవం మిగులుతుందని కార్తీక్ చెప్పుకొచ్చాడు. మున్ముందు ఇలాంటి వజయాలను తాము తప్పకుండా అందుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు కేకేఆర్ కెప్టెన్. ప్రస్తుతం తమ జట్టు సభ్యులు టాప్ క్లాస్ ఆటతీరును ప్రదర్శిస్తున్నారని దినేష్ కార్తీక్ చెబుతున్నాడు.

ఇక తమ దృష్టంతే రాబోయే మ్యాచులపై ఉంటుందని.. ఒక్కో మ్యాచులో తాము ఎలాంటి వ్యూహాన్ని రచించాలో జట్టు సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకుంటానని అన్నాడు కేకేఆర్ కెప్టెన్. ఈ మ్యాచులో నితీష్ రానా చాలా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి జట్టు విజయంలో చాలా కీలకమైన పాత్ర పోషించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపాడు దినేష్ కార్తీక్.

SHARE