రెండు సంవత్సరాలు ఐపిఎల్ నుండి వేటుకు గురైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, శనివారం ముంబై ఇండియన్స్ పై జరిగిన మ్యాచ్ లో సంచలన విజయం సాధించి అభిమానులను ఉర్రూతలూగించింది.

అయితే మంగళవారం చెన్నై జట్టు తొలిసారి వారి సొంత గడ్డపై ఆడనున్నారు. 2015 తరువాత ఐపీఎల్ క్రికెట్ చూడని చెన్నై ప్రేక్షకులు ఈ ఆట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పిచ్ రిపోర్ట్

చెన్నైలో ఎప్పుడూ గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా అక్కడి చెపాక్ స్టేడియంలో పిచ్ ఎప్పుడు స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించడం అందరికీ తెలిసిన విషయమే.

ఈసారి కూడా పిచ్ అదే విధంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ ఆటకు వర్షం ఎటువంటి ఆటంకం కలిగించే అవకాశం లేదు. అందుకే ఇరు జట్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

టాస్ గెలిస్తే?

సాధారణంగా ఇటీవల కాలంలో టీ 20 క్రికెట్లో టాస్ గెలిస్తే కెప్టెన్లు తొలుత ఫీల్డింగ్ చేసేందుకు ఇష్టపడతారు. అయితే చెన్నైలో మాత్రం తొలుత బ్యాటింగ్ చేస్తేనే జట్టుకు ఆధిపత్యం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి.

ఎందుకంటే రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యేసరికి పిచ్ మరింత మెల్లగా అవ్వడంతో స్పిన్నర్లు మరింత కీలక పాత్ర పోషిస్తారు. దీనితో టాస్ గెలిస్తే దినేష్ కార్తిక్ లేదా మహేంద్ర సింగ్ ధోనీ, ముందు బ్యాటింగ్ చేసేందుకే ఇష్టపడతారు.

హెడ్ టు హెడ్ రికార్డు

ఐపీఎల్ 2018 లో ఇరు జట్లు ఇప్పటి వరకూ తమ తొలి మ్యాచ్ ఆడాయి. ఇరు జట్లు వారి వారి మ్యాచ్‌లు గెలవడంతో ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తి నెలకొంది.

ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 17 సార్లు తలపడగా, చెన్నై సూపర్ కింగ్స్ 10 విజయాలు సాధించింది. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ 6 విజయాలు సాధించగా, ఒక ఆట మాత్రం వాన వల్ల రద్దయింది.

కీలక ప్లేయర్లు

ముంబయితో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు ఆల్‌రౌండర్ డ్వెయిన్ బ్రావో. అతను బౌలింగ్ లో అద్భుతంగా రాణించగా బ్యాటింగ్‌లో సంచలనమే సృష్టించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు అతను మాత్రం హిట్టింగ్ తగ్గకుండా జట్టును విజయం ధరికి చేర్చాడు. చివరిలో కేదార్ జాదవ్ మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ అందించడం ప్రశంసనీయం.

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు అత్యంత ముఖ్యమైన ఆటగాడు సునీల్ నరేన్. అతను కేవలం బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా ఐపీఎల్ లో విప్లవం సృష్టిస్తున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్ లో అతను కేవలం 18 బంతుల్లో 50 పరుగులు చేసి మ్యాచ్ ను కోల్ కత్తాకు అందించాడు.

మ్యాచ్ అంచనా

కోల్ కతా నైట్ రైడర్స్ చక్కటి ఫామ్ కనబరిచినప్పటికీ, దినేశ్ కార్తిక్ తన సొంత గ్రౌండ్లో పరాజయం సాధిస్తాడు. చెన్నై సూపర్ కింగ్స్ ను చెపాక్‌లో ఓడించడం అంత తేలికైన విషయం కాదు.

SHARE