ఐపీఎల్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సస్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 71 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ కోల్‌కతా జట్టు అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిందని చెప్పాడు.

కేకేఆర్ జట్టు చాలా బాగా ఆడిందని, వారు విజయానికి పూర్తి అర్హులని గౌతమ్ అన్నాడు. ఒక సమయంలో కోల్‌కతాను 170-175 పరుగులకు కట్టడి చేస్తామని ప్రయత్నించినా రస్సెల్ తమ ప్లాన్‌ను తిప్పికొట్టాడు. బ్యాట్స్‌మెన్ ఎప్పుడైతే విధ్వంసకరంగా బ్యాటింగ్ చేస్తుంటాడో అతడిని కట్టడి చేయడం చాలా కష్టం. రస్సెల్ విషయంలోనూ ఇదే జరిగిందని గౌతమ్ అన్నాడు.

ఆ గేమ్‌పై జట్టు సభ్యులతో కలిసి పక్కా ప్లానింగ్‌తో వెళ్లాలని చర్చించినా దానిని అమలు చేయడంలో తాము ఫెయిల్ అయ్యాం అని గౌతమ్ గంభీర్ చెప్పాడు. సొంతగడ్డపై ప్రత్యర్థులను ఓడించడం చాలా కష్టం. అయినా తమ జట్టు ఇది సాధించాలని పూర్తి ప్రయత్నం చేసింది. బౌలర్లపై రస్సెల్ దాడిని అడ్డుకోవడంలో తాము తడబడటం వాస్తవమే అని అన్నాడు ఢిల్లీ కెప్టెన్.

తమ జట్టుకు రాబోయే మ్యాచ్ చాలా కీలకం అని అన్నాడు గౌతమ్. ఆ మ్యాచ్ గెలిస్తే తమ జట్టులో ఉత్సాహం పెరుగుతుందని తద్వారా రాబోయే మ్యాచ్‌లను కాన్ఫిడెంట్‌గా ఆడగలం అంటున్నాడు గౌతమ్. ఇంకా 10 మ్యాచులు తాము ఆడాల్సి ఉందని వాటి కోసం చాలా కష్టపడాల్సి ఉందని గౌతమ్ గంభీర్ చెప్పాడు.

SHARE