(Credits: BCCI)

ఐపీఎల్ 2018 లో ఇప్పటివరకూ తమ స్థాయికి తగిన ప్రదర్శనలు ఇచ్చిన రెండే రెండు జట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్. అయితే అంబటి రాయుడు తన అద్భుతమైన ఫామ్ను కనబర్చడంతో మరోసారి చెన్నై కీలక విజయం సాధించింది.

టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్, పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మూడవ ఓవర్లోనే అలెక్స్ హేల్స్ వికెట్ తీసినప్పటికీ తరువాత కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్ బ్యాటింగ్ కు అడ్డుకట్ట వేయలేకపోయారు.

Shikhar Dhawan of SRH and Kane Williamson captain of SRH during match forty two of the Vivo Indian Premier League 2018 (IPL 2018) between the Delhi Daredevils and the Sunrisers Hyderabad held at the Feroz Shah Kotla Ground, Delhi on the 10th May 2018.
Photo by: Rahul Gulati /SPORTZPICS for BCCI

ఈ ఇరువురు రెండవ వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మంచి స్థితికి చేరింది. అయితే ధావన్, విలియమ్సన్ వరుస బంతుల్లో అవుట్ కావడంతో చివరి ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకున్న రీతిలో పరుగులు సాధించలేకపోయారు. వారు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేశారు.

180 పరుగుల భారీ లక్ష్యం చేధించడానికి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు షేన్ వాట్సన్, అంబటి రాయుడు బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ద్వయం మ్యాచ్ను తొలి పది ఓవర్లలోనే చెన్నై వైపు తిప్పేశారు.

ఓపెనర్ షేన్ వాట్సన్ కేవలం 35 బంతుల్లో 57 పరుగులు చేసి అలరించాడు. అయితే అతను రన్ అవుట్ అయిన వెంటనే బ్యాటింగ్కు వచ్చిన సురేష్ రైనా కూడా వెనుదిరగడంతో సన్రైజర్స్ జట్టుకు కాస్త ఆశలు చిగురించాయి.

(Credits: BCCI)

కానీ అంబటి రాయుడు తన సంచలనమైన ఫామ్లో కొనసాగించడంతో మ్యాచ్ చెన్నై వశం అయ్యింది. అతను కేవలం 62 బంతుల్లో 100 పరుగులు చేసి మరోసారి తన సత్తా చాటాడు. మరోవైపు నాల్గవ నెంబర్ లో వచ్చిన ధోనీ కూడా చక్కగా ఆడటంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే వారు లక్ష్యాన్ని ఛేదించేసారు.

ఈ కీలక విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ దశకు చేరుకున్న రెండవ జట్టు అయ్యింది. ప్రస్తుత ఫామ్ పరిగణలోకి తీసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలను దక్కించుకునే అవకాశం మెండుగా ఉంది.

అయితే మరో రెండు క్వాలిఫైయింగ్ స్థానాల కోసం అయిదు జట్లు తలపడటం విశేషం.

SHARE