గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్‌గా పేరు సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిన్నవయసులోనే క్రికెట్‌లో అడుగుపెట్టి సుదీర్ఘకాలం కెరీర్‌ను కొనసాగించిన సచిన్ ఎలాంటి రికార్డులను తన బ్యాట్‌తో నెలకొల్పాడో అందరికీ తెలిసిందే. ముంబై ముద్దు బిడ్డగా సచిన్‌ను అక్కడి జనాలు గుండెల్లో పెట్టుకుని చూసుకునే విషయం కూడా అందరికీ విదితమే. తాజాగా సచిన్ ఎవ్వరూ ఊహించని విధంగా ప్రవర్తించి తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చాడు.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియో ప్రకారం సచిన్ తన కారులో అర్ధరాత్రి పూట ప్రయాణం చేస్తుండగా ముంబై వీధుల్లో కొందరు యువకులు గల్లీ క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఇది చూసిన సచిన్ వెంటనే తన కారును పక్కకు ఆపి తాను కూడా ఆ యువకులతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడాడు. ఇది చూసిన ఆ యువకులు షాక్‌కు గురయ్యారు. కానీ వెంటనే తేరుకుని తమ అభిమాన క్రికెట్ దేవుడితో తమకు దొరికిన అరుదైన క్షణాలను ఆస్వాదించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై వీధుల్లోనే సచిన్ క్రికెట్ ఆట ఆడిన విషయం ప్రతీ భారతీయ క్రికెట్ అభిమానికి తెలుసు. ఆ తరువాత ఆయన ఇండియన్ క్రికెట్‌లో ఎలాంటి సెన్సేషన్‌గా మారాడో కూడా ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. అంతేగాక ఐపీఎల్‌లో సచిన్ ముంబై ఇండియన్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అప్పట్లో ముంబై అంటే సచిన్.. సచిన్ అంటే ముంబై అనే రేంజులో తన సత్తా చాటుకున్నాడు.

గతంలో ఐపీఎల్‌లో 78 మ్యాచ్‌లు ఆడిన సచిన్ 2334 పరుగులు సాధించాడు. అంతేగాక అనేకసార్లు మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్‌తో తన జట్టుకు విజయపతాకాలను అందించాడు. ప్రస్తుతం సచిన్ ముంబై ఇండియన్స్ జట్టులో సపోర్ట్ స్టాఫ్‌గా ఉన్నాడు.