ఇంగ్లాండ్‌తో తొలి మూడు టెస్టుల్లో తలపడే 18 మంది భారత జట్టు సభ్యులను బుధవారం సెలక్టర్లు ప్రకటించారు.యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు తొలిసారి టెస్టు జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు. భారత జట్టునుంచి ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు ఉద్వాసన పలికారు. దినేశ్‌ కార్తీక్‌తోపాటు స్పెషలిస్ట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా 20 ఏళ్ల ఢిల్లీ ఆటగాడు పంత్‌కు చాన్స్‌ ఇచ్చారు. ఇక..టెస్ట్‌ రెగ్యులర్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఐపీఎల్‌లో బొటన వేలికి అయిన గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌కు జట్టులో చోటు దక్కించుకున్న దినేశ్‌ కార్తీక్‌..తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అఫ్ఘాన్‌తో మ్యాచ్‌కు ఎంపిక కాలేకపోయిన పేసర్‌ షమి.. పూర్తి ఫిట్‌నెస్‌ సంతరించుకోవడంతో జట్టులోకి మళ్లీ పిలుపు వచ్చింది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆగస్టు ఒకటిన ప్రారంభం కానుంది.

వృద్ధిమాన్ సాహా గాయపడటంతో అతని స్థానంలో పంత్‌కు ఓ అవకాశం ఇచ్చారు. మరోవైపు దినేష్ కార్తీక్‌ను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. బొటన వేలి గాయంతో ఇంగ్లాండ్ టీ20, వన్డే సిరిస్‌కు దూరమైన బుమ్రాకు కూడా చోటు దక్కింది.బుమ్రాను జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ అతను రెండో టెస్ట్ నుంచి తుది జట్టు ఎంపికకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. మూడో వన్డేలో గాయపడిన భువనేశ్వర్ కుమార్‌కు సెలక్టర్లు జట్టులో చోటు కల్పించలేదు.భువనేశ్వర్ కుమార్ వెన్ను గాయం మరింత ఎక్కువైందని, టెస్టు జట్టులోకి అతన్ని తీసుకోవాలా వద్ద అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని ఆ ప్రకటనలో బోర్డు చెప్పింది.

యువతకే ఓటు: ఇంగ్లండ్‌తో టీ-20, వన్డే సిరీస్‌ల్లో రెండు సెంచరీలతో సత్తా చాటిన రోహిత్‌ శర్మకు టెస్ట్‌ జట్టులో చోటు లభిస్తుందని భావించారు. కానీ సెలెక్టర్లు యువ రక్తానికే ప్రాధాన్యమిచ్చి పంత్‌పట్ల మొగ్గు చూపారు.ఇక టెస్ట్‌ జట్టుకు ఎంపికైన మరో ముగ్గురిలో ఓపెనర్‌ మురళీ విజయ్‌, వైస్‌-కెప్టెన్‌ అజింక్యా రహానె, కరుణ్‌ నాయర్‌ ఉన్నారు. వీరు ముగ్గురు ఇంగ్లండ్‌ లయన్స్‌తో మ్యాచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అఫ్ఘాన్‌తో టెస్ట్‌కు తుది జట్టులో చోటు దక్కని నాయర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ ఇంగ్లండ్‌తో    సిరీస్ కు  తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. ఆగ‌స్టు 1న ఎడ్‌బాస్ట‌న్‌ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.

ఇంగ్లాండ్‌తో మొదటి మూడు టెస్టులకు టీమిండియా:
కోహ్లీ, ధావన్, రాహుల్, విజయ్, పుజారా, రహానే, కరుణ్ నాయర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, అశ్విన్, జడేజా, కుల్‌దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్

SHARE