మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-1 సమంగా ఉన్న భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఆఖరి పోరు నేడే.

బ్రిస్టల్‌: భారత్‌, ఇంగ్లాండ్‌ నిర్ణయాత్మక టీ20 మ్యాచ్‌కు వేళైంది. ఆదివారమే చివరిదైన మూడో టీ20. తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిపై ఘన విజయాన్ని నమోదు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం ఓటమిని మూటకట్టుకుంది. ఈ మ్యాచ్‌తోపాటు మూడో టీ-20లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంటామని కలలుగన్న కోహ్లీ ఆశలపై ప్రత్యర్థి టీమ్ నీళ్లు చల్లింది.ఇక గెలవాల్సింది మరొకటి. ఇప్పుడు రెండు జట్ల లక్ష్యం ఇప్పుడు ట్రోఫీనే. దీంతో నిర్ణాయక మూడో టి20లో తాడోపేడో తేల్చుకునేందుకు  తహతహలాడుతున్నాయి. ఇటు కోహ్లి సేన, అటు మోర్గాన్‌ బృందం బ్యాటింగ్, బౌలింగ్‌ల్లో సమవుజ్జీగా కనబడుతున్నాయి.

 

దీంతో ఆదివారం రసవత్తర పోరుకు తెరలేవనుంది. రెండో మ్యాచ్‌లో అంతగా ప్రభావం చూపని నేపథ్యంలో భారత స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ స్పిన్‌కు బాగా సన్నద్ధమవడం ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లకు సవాలే. ఆరంభ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో సంచలనం సృష్టించిన కుల్‌దీప్‌ కార్డిఫ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. చాహల్‌ ఒక్క వికెట్‌తో సరిపెట్టుకున్నాడు. ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలంటే వీళ్లిప్పుడు కొత్త మార్గాలను అన్వేషించాల్సిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే వరుసగా ఆరో టీ20 సిరీస్‌ సొంతమవుతుంది. రెండో టీ20 జరిగిన కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఒక వేదికపై ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు నెలకొల్పింది.

జట్లు (అంచనా) 
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాహుల్, రైనా, ధోని, పాండ్యా, చహల్, కుల్దీప్, భువనేశ్వర్, ఉమేశ్‌ యాదవ్‌.
ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), జాసన్‌ రాయ్, బట్లర్, హేల్స్, రూట్‌/స్టోక్స్, బెయిర్‌స్టో, విల్లీ, ప్లంకెట్, జోర్డాన్, రషీద్, జేక్‌ బాల్‌.

 

 

 

SHARE