డబ్లిన్‌ : సోమవారం డబ్లిన్‌ వేదికగా జరిగిన సమావేశంలో పలు కొత్త నిబంధనలకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రాబోయే రోజుల్లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడితే ఐసీసీ కఠిన శిక్షలు అమలు చేయనుంది. బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడే ఆటగాళ్లను ఇకపై ఎంతమాత్రమూ ఉపేక్షించరాదని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌ సన్‌ వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ఇకపై బాల్ ను మార్చాలని చూస్తే కనిష్ఠంగా ఆరు టెస్టు మ్యాచ్ ల నుంచి గరిష్ఠంగా 12 మ్యాచ్ ల వరకూ నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు.

తప్పును లెవల్-3కి మార్చిన ఐసీసీ

ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది అభిమానులు ఉన్న క్రికెట్‌లో అత్యున్నత ప్రమాణాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది అని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ స్పష్టంచేశారు. ఇందుకు తగ్గట్లు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు.తాజా నిబంధనల ప్రకారం బాల్ టాంపరింగ్‌ను లెవెల్-3 తప్పిదం కిందకు తీసుకొచ్చింది. గతంలో బాల్ టాంపరింగ్‌ను లెవెల్-2 తప్పిదంగా పరిగణించేవారు. బాల్ టాంఫరింగ్‌కు పాల్పడితే గరిష్ఠంగా 12 సస్పెన్షన్ పాయింట్లు విధిస్తారు. ఇది ఆరు టెస్టులు లేదా, 12 వన్డేల నిషేధానికి సమానం.

తప్పిదానికి (Offence) లెవెల్
అర్హతలేని ప్రయోజన్నాని పొందే ప్రయత్నం (మోసం,బాల్ టాంపరింగ్ కాకుండా * 2, 3
వ్యక్తిగత దూషణ * 2, 3
అసభ్యతగా వినిపించే మాటలు* 1
అంపైర్ సూచనలను అతిక్రమించినప్పుడు * 1
బంతి పరిస్థితి మార్చడం 3 (from 2)

*కొత్త నేరం సూచిస్తుంది

కఠిన శిక్షలను -ఐసీసీ

మోసం చేయడం, వ్యక్తిగతంగా దూషించడం, అసభ్యకరంగా వ్యవహరించడం, అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవడం లాంటివి చేస్తే ఇకపై క్రికెటర్లకు మరింత కఠిన శిక్షలను ఐసీసీ అమలు చేయనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ కఠిన శిక్షలను రికమెండ్ చేసినట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ తెలిపారు.

ఇందులో వ్యక్తిగత దూషణ, బాల్ టాంపరింగ్ లాంటి ఘటనలకుగాను కఠిన శిక్షలను అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు, తమ ప్లేయర్స్ వ్యవహార తీరుకు సంబంధిత క్రికెట్ బోర్డులను కూడా బాధ్యులను చేసే నిబంధనను కూడా ఐసీసీ పరిగణలోకి తీసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

 

SHARE