రో‘హిట్‌’ మ్యాన్‌ మళ్లీ తన ఫామ్‌ను అందుకున్నాడు. క్రీజులో నిలిస్తే తానెంత ప్రమాదకర ఆటగాడో మరోసారి చాటుకున్నాడు. అంతేకాదు.. స్వదేశంలోనే తప్పించి విదేశాల్లో ఆడలేడనే విమర్శలకు తగిన సమాధానమిచ్చాడు. పనిలోపనిగా తన ఫిట్‌నెస్‌ స్థాయేంటో కూడా చాటిచెప్పాడు. భారీ లక్ష్యం కళ్లముందున్నా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన ఈ టాలెంటెడ్‌ బ్యాట్స్‌మన్‌ కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో శతకాన్ని పూర్తి చేశాడు. ఇప్పటికే వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా నిలిచిన రోహిత్‌, పొట్టి ఫార్మాట్‌లో మూడు శతకాలు చేసిన రెండో ఆటగాడిగా కొలిన్‌ మున్రో (న్యూజిలాండ్‌) రికార్డును సమం చేశాడు.
2015లో దక్షిణాఫ్రికాతో తొలి సెంచరీ సాధించిన ఈ హిట్‌ మ్యాన్‌.. గతేడాది శ్రీలంకపై మరో సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌లో 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు.

టీ20ల్లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్ళు :
కొలిన్‌ మున్రో (న్యూజిలాండ్‌) -3
రోహిత్ శర్మ (భారత్) – 3
ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)-2
క్రిస్ గేల్(వెస్టిండీస్) -2
మార్టిన్ గుప్తిల్ (న్యూజిలాండ్‌) -2
ఎవిన్ లూయిస్(వెస్టిండీస్) -2
బ్రెండన్ మెక్కలమ్(న్యూజిలాండ్‌) -2
గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా)-2
కే.ఎల్.రాహుల్(భారత్) – 2
అంతేకాకుండా,ఈ మ్యాచ్‌లో రోహిత్‌ మరో ఘనతను అందుకున్నాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా ఈ ముంబై క్రికెటర్‌ గుర్తింపు పొందాడు. ఈ సిరీస్‌లోనే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ ఘనతను అందుకున్న విషయం తెలిసిందే. కోహ్లి 56 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను అందుకొవడంతో వేగంగా ఈ మైలురాయి అందుకున్న క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో ఓవరాల్‌గా రోహిత్‌ నాలుగో స్థానంలో నిలవగా.. అతని కన్న ముందు మార్టిన్‌ గప్టిల్‌, షోయబ్‌ మాలిక్‌ , కోహ్లిలున్నారు.

SHARE