కార్డిఫ్‌: తొలి మ్యాచ్‌లో నెగ్గిన జోష్‌లో ఉన్న భారత్‌ ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ విజయంతో ఆరంభించింది. శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ జరగనుంది. దీనిలోనూ నెగ్గితే భారత్‌ వరుసగా ఆరో టీ20 సిరీస్‌ను ఖాతాలో వేసుకున్నట్టవుతుంది. అలాగే 3-0తో నెగ్గితే ఆసీస్ ను  వెనక్కినెట్టి భారత్‌ రెండో ర్యాంక్‌ సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడినా జట్టుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు కానీ ఇంగ్లండ్‌ మాత్రం కచ్చితంగా నెగ్గాల్సిందే. అలాగైతేనే వారు సిరీస్‌పై ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అటు ర్యాంకింగ్‌ పరంగానూ ఈ జట్టు ఏడో స్థానానికి పడిపోతుంది.

అన్ని విభాగాల్లో పటిష్ఠం :  భారత్‌కు ప్రధాన ఆయుధంగా మారిన చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ రెండో టీ20లోనూ విజృంభించాలని జట్టు కోరుకుంటోంది. ఐర్లాండ్‌ సిరీస్‌తో మొదలుకొని కుల్‌దీప్‌.. కీలక వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కుప్పకూలుస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో అతను ఐదు వికెట్లు తీయడం వల్లే ప్రత్యర్థి భారీ స్కోరు చేయలేకపోయింది. అతనికి తోడు లెగ్‌స్పిన్నర్‌ చాహల్‌ రాణిస్తుండంతో భారత్‌కు ఎదురేలేకుండాపోతోంది.  తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌ ధవన్‌ మినహా బ్యాటింగ్‌కొచ్చిన బ్యాట్స్‌మెన్‌ ముగ్గురూ రాణించారు. ముఖ్యంగా రాహుల్‌ రెండేళ్లుగా ఊరిస్తున్న అంతర్జాతీయ శతకం లోటును తీర్చుకున్నాడు. అలాగే తాను అన్ని ఫార్మాట్లకూ ఉపయోగకరమనే భావననూ కలిగించాడు. ఇక బౌలింగ్‌లో స్పిన్‌ విభాగం అద్భుతంగానే ఉన్నా తొలి మ్యాచ్‌లో పేసర్లు భువనేశ్వర్‌, ఉమేశ్‌ పెద్దగా ప్రభావం చూపకపోవడం ఆందోళన కలిగించే అంశం. అయితే విన్నింగ్‌ కాంబినేషన్‌ను మార్చే ఆలోచనలో మేనేజ్‌మెంట్‌ లేదు.

SHARE