లీడ్స్: వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించడం అంత తేలిక కాదని రెండో వన్డేతో తేలిపోయింది. లార్డ్స్‌లో ఓటమి భారత్ బలహీనతలను బయటపెట్టింది. ముఖ్యంగా పేసర్లు పరుగులను నియంత్రించలేకపోతున్నారు. రెండో వన్డేలో చివరి 8 ఓవర్లలో 82 పరుగులు సమర్పించుకోగా.. ఇందులో ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్, పాండ్యా కలిసి ఆరు ఓవర్లలో 62 పరుగులిచ్చారు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్స్ భువనేశ్వర్, బుమ్రా లేకపోవడం ఇబ్బందిపెడుతోంది. అయితే ఫిట్నెస్ సంతరించుకున్న భువి ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశముండడం భారత్‌కు శుభవార్తే.
లార్డ్స్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. కీలకమైన నాలుగో స్థానంలో సరైన ప్రదర్శన లేకపోవడం మిడిల్‌పై మరింత భారాన్ని పెంచుతోంది. మంచి ఫామ్‌తోనే వన్డే సిరీస్‌లోకి వచ్చినప్పటికీ లార్డ్స్‌లో కేఎల్ రాహుల్ రాణించలేకపోయాడు. ఈ విషయంలో రాహుల్, ధోని, రైనా, పాండ్యా మరింత మెరుగవ్వాల్సి ఉంది. నెమ్మదైన ఆటతో అనూహ్యంగా ధోని కూడా ప్రేక్షకుల హేళనలకు గురయ్యాడంటే గత మ్యాచ్ పరిస్థితి అర్థమవుతుంది. యోయో టెస్టులో రాయుడు వైఫల్యంతో మూడేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం దక్కించుకున్న రైనా ఫర్వాలేదనిపించినా అతను చాలా ఇబ్బంది పడుతూ ఆడటం కనిపించింది. ఎడమ చేతివాటం, బౌలింగ్ చేయడం అదనపు అర్హతగా రైనాకు చోటు లభిస్తున్నా… తాజా ఫామ్, షాట్ల వైవిధ్యాన్ని బట్టి చూస్తే దినేశ్ కార్తీక్‌ను ఆడించే అవకాశం కూడా కనిపిస్తోంది. భారత్ టాప్ ఆర్డర్‌పై ఎక్కువగా ఆధారపడిందన్నది నిజం. గత రెండు సీజన్లలో భారత్ వన్డే పరుగుల్లో దాదాపు 60 శాతం చేసిన టాప్ త్రయం ధావన్, రోహిత్, కోహ్లి రాణించడం భారత్ అవకాశాలకు ఎంతో కీలకం. సిద్ధార్థ్ కౌల్ స్థానంలో భువనేశ్వర్ రావడం తప్ప భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్),Ms.ధోని(wk),సురేష్ రైనా, రోహిత్ శర్మ, షికార్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, KL రాహుల్, హరిక్ పాండ్య, దినేష్ కార్తీక్, సిద్దార్థ్ కౌల్, మనీష్ పాండే , దీపక్ చహర్, క్రునాల్ పాండ్య.