బ్రిస్టల్ : చాల వేగంగా పాఠం నేర్చుకున్న ఇంగ్లండ్‌ రెండో మ్యాచ్‌లో భారత బౌలర్లకు ఏమా త్రం చాన్సివ్వలేదు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు కూడా కలిసొ చ్చాయి. బెన్‌స్టోక్స్‌ స్థానంలో టీమ్‌లోకి వచ్చిన హేల్స్‌.. మోర్గాన్‌తో కలిసి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించాడు. ప్రత్యర్థి జట్టు సమతూకంగా ఉంది. బ్యాటింగ్‌లో బట్లర్, రాయ్, హేల్స్, బెయిర్‌ స్టో ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ బట్లర్‌ ప్రమాదకర బ్యాట్స్‌మన్‌. ఫిట్‌నెస్‌తో ఉన్న ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను ఆడించే విషయాన్ని టాస్‌కు ముందు నిర్ణయిస్తామని జట్టు మేనేజ్‌మెంట్‌ తెలిపింది. బౌలింగ్‌లో విల్లీ, జేక్‌ బాల్, ప్లంకెట్‌లు భారత బ్యాటింగ్‌ను దెబ్బతీయగల సమర్థులు. గత మ్యాచ్‌లో వీళ్లంతా తీసింది ఒక్కో వికెటే అయినా… భారత్‌ను పుంజుకోకుండా చేశారు. కానీ, చివరి మ్యాచ్‌కు స్టోక్స్‌ టీమ్‌లోకి రానుండడంతో ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాసం మరింతగా పెరగనుంది. ఫామ్‌లో లేని రూట్‌ను పక్కనబెట్టి స్టోక్స్‌ను టీమ్‌లోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇక రెండు మ్యాచ్‌ల్లో స్పిన్‌ను భారత బ్యాట్స్‌మెన్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. షార్ట్‌ పిచ్‌ బంతులతో టీమిండియా టాపార్డర్‌ను ఇంగ్లండ్‌ దెబ్బ తీసింది. ఓపెనర్‌ రోహిత్‌, రాహుల్‌లు షార్ట్‌ డెలివరీలను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డారు. ధవన్‌, రైనా కూడా ఎదురుదాడికి దిగలేక పోయారు. షార్ట్‌ డెలివరీని ఆడే క్రమంలో కోహ్లీ క్యాచవుటయ్యాడు. దీంతో మోర్గాన్‌ మరోసారి ఇదే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌ కావడంతో ఇరుజట్లూ ప్రయోగాలు చేసే పరిస్థితి కనిపించడంలేదు.

SHARE