క్రికెట్లో ఇప్పటి వరకూ మనం చాలా మంది గొప్ప ఆటగాళ్లను చూశాం. కొంతమంది అత్యద్భుతమైన బ్యాటింగ్తో మన అలరించగా, మరి కొంతమంది బౌలింగ్తో మన మన్ననలను పొందారు.

అయితే ఈ కోవకి చెందిన అద్భుతమైన క్రికెటర్ సౌతాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్. అతను ఆడే విధానంతో ఎందరో క్రికెట్ అభిమానులు సంపాదించుకోవడమే కాకుండా, సాటి క్రికెటర్ల నుండి కూడా గొప్ప మన్ననలను పొందాడు.

అయితే బుధవారం డివిలియర్స్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పిడుగులాంటి వార్తను అందజేశాడు. ఇకపై అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడబోనని అన్ని ఫార్మెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు చెప్పాడు.

గత రెండు దశాబ్దాల్లో వచ్చిన అత్యద్భుత క్రికెటర్లలో అతను ఒకడు. కేవలం అభిమానులను అలరించడమే కాకుండా అత్యంత నిలకడగా పరుగులు చేస్తూ ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే అందరూ అతను 2019 ప్రపంచ కప్ వరకు సౌతాఫ్రికా జట్టుకు ఆడతాడని ఆశించినప్పటికీ ఈ వార్త క్రికెట్ ప్రపంచానికి షాక్ లా తగిలింది.

అయితే సౌత్ ఆఫ్రికా జట్టుకు ఇప్పటి వరకు ప్రపంచ కప్పు గెలవలేదు అనే లోటుతోనే అతడు రిటైర్ కావడం బాధాకరం. ఇటీవలే సౌతాఫ్రికా పేసర్ మోర్నీ మార్కెల్ కూడా రిటైర్ కావటంతో ఇప్పుడు దక్షిణాఫ్రికా క్రికెట్లో పెద్ద సంక్షోభమే ఏర్పడింది.

తన కెరీర్లో 114 టెస్టు మ్యాచ్లు, 228 వన్డే మ్యాచ్లు , 78 టీ20 మ్యాచ్లు ఆడిన డివిలియర్స్ ఆ ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్లలో ఒకడు. అతను ఆడే విధానం ఎందరో అభిమానులను ప్రపంచవ్యాప్తంగా అతనికి తెచ్చిపెట్టింది.

అయితే ఈ వార్త వెలువడిన వెంటనే కేవలం అభిమానులే కాకుండా, స్టార్ క్రికెటర్లు కూడా ఎందరో తమ సంఘీభావంతో పాటు, అతని అద్భుతమైన కెరీర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన డివిలియర్స్, అద్భుతమైన ఫామ్ కనబరిచాడు.

అయితే తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ తాను మంచి ఫామ్లో ఉన్నప్పుడే రిటైర్ కావడానికి ఇష్టపడుతున్నట్టు అభిమానులకు తెలిపాడు. అంతే కాకుండా భారత్, ఆస్ట్రేలియాపై వరుస టెస్ట్ విజయాలు సాధించిన తర్వాత రిటైర్ కావడానికి ఇదే సరైన సమయమని తెలిపాడు.

తనకు ఇకపై ఓవర్సీస్ లో ఆడే ఆలోచనలు పెద్దగా లేవని, వీలైనంతవరకూ దేశవాళీ క్రికెట్లో తన టైటాన్స్ జట్టుకు ఆడడానికి మొగ్గు చూపనున్నట్లు అతను తెలిపాడు. అంతేకాకుండా అతను తన ట్విట్టర్లో పెట్టిన వీడియోలో తన అభిమానులు అందరికీ తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

కేవలం ఒక గొప్ప క్రికెటర్ గానే కాకుండా, అతను మోడ్రన్ క్రికెట్ పై చూపిన ప్రభావం భవిష్యత్తు తరాలు తప్పకుండా గుర్తు చేసుకుంటాయి. అంతేకాకుండా ఎటువంటి సమయంలో అయినా ఎటువంటి వాతావరణంలో అయినా సరే అత్యద్భుతమైన టెక్నిక్ కలిగివున్న డివిలియర్స్, క్రికెట్ చరిత్రలోనే అత్యంత సంపూర్ణమైన బ్యాట్స్మన్ అన్నా సరే తక్కువ కాదేమో!!

అయితే కుదిరితే అతను వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడితే బాగుంటుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

SHARE