ధోనీ విజయవంతమైన కెప్టెన్ మాత్రమే కాదు ,అద్బుతమైన వికెట్ కీపర్ కూడా.ధోని   తరువాత  అటు టెస్ట్‌ల్లో ఇటు వన్డేలతోపాటు టీ20ల్లో అతడి స్థానాన్ని భర్తీ చేసే బెస్ట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ఎవరు అన్న చర్చ వచ్చినప్పుడు నేనున్నానంటూ భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చాడు ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌.

అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో మొదలైన అతడి అద్భుత ప్రదర్శన అలా కొనసాగుతూ ,రంజీ చేరి అటుపై ఐపీఎల్‌కు చేరింది.. రంజీల్లో ట్రిపుల్‌ సెంచరీ చేయడం ద్వారా సుదీర్ఘ మ్యాచ్‌లకూ తాను రెడీ అని చెప్పకనే చెప్పాడు.వృద్దిమాన్ సాహబొటను వేలు గాయం నుండి కోలుకోకపోవడం తో టెస్ట్‌ల్లో పంత్‌కు దారులు తెరుచుకున్నాయి.

రిషభ్‌ పంత్‌..20 ఏళ్ల ఈ ఎడమచేతి బ్యాట్స్‌మన్‌ పేరు గతకొద్ది సీజన్లుగా దేశ క్రికెట్‌లో మార్మోగుతోంది. డెహ్రాడూన్‌లో జన్మించిన ఈ ఆటగాడు క్రికెట్‌ కెరీర్‌కు తొలుత రూర్కీలో బాటలు వేసుకొన్నాడు. అక్కడ సరైన సౌకర్యాలు,లేకపోవడంతో ఢిల్లీకి వచ్చేశాడు. అక్కడ నుంచి రాజస్థాన్‌ వెళ్లినా మళ్లీ ఢిల్లీ వచ్చేసి క్రికెట్‌లో తన అద్భుత ప్రతిభకు మెరుగులు దిద్దుకోవడం ద్వారా దేశం దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీల్లో మెరుపులు మెరిపించిన పంత్‌..బంగ్లాదేశ్‌లో 2016లో అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో తన అసలు సిసలు సత్తా ప్రదర్శించాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా విశ్వరూపం చూపిన అతడు..24 బంతుల్లోనే 75 పరుగులు చేసి ఆ టోర్నీలో ఫాస్టెస్‌ హాఫ్‌ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. అదే ఊపుతో నమీబియా బౌలర్లపై విరుచుకుపడి శతక్కొట్టాడు. అయితే భారత్‌కు టైటిల్‌ దక్కకపోయినా ఆ చాంపియన్‌షిప్‌ ద్వారా పంత్‌ అనే డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వెలుగులోకి వచ్చాడు.

2015లో రంజీల్లో అరంగేట్రం చేసేనాటికి  పంత్‌ కి 18 ఏళ్ల వయస్సు. రంజీల్లో మహారాష్ట్రపై ఏకంగా ట్రిపుల్‌ సెంచరీ (326 బంతుల్లో 9 సిక్స్‌లు, 42 ఫోర్లతో 308) చేసి సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ తానేమిటో నిరూపించాడు. అంతటితో ఆగలేదు అతడి పరుగుల ప్రవాహం, 2016-17 ఫస్ట్‌క్లాస్‌ సీజన్‌లో మరింత రెచ్చిపోయాడు జార్ఖండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించి 48 బంతుల్లోనే సెంచరీతో మరో రికా ర్డు సృష్టించాడు. ఇంకా ముస్తాక్‌ అలీ టీ-20 టోర్నీలో హిమాచల్‌ప్రదేశ్‌పై సెంచరీతో వరల్డ్‌ టీ-20ల్లో రెండో ఫాస్టెస్‌ సెంచరీ చేసి మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. అతడి అమోఘ ఇన్నింగ్స్‌లకు బహుమతిగా 2017 జనవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ-20 సిరీ్‌సకు టీమిండియాలో చోటు లభించింది.      ఈ యేడు ఐపీఎల్‌లో కొన్ని కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌ ఆడిన పంత్‌.. ముఖ్యంగా అత్యంత పటిష్ఠమైన సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ విభాగం భరతం పట్టి కేవలం 63 బంతుల్లోనే 128 పరుగులు (15 ఫోర్లు, 7 సిక్స్‌లు) చేసి ఔరా అనిపించాడు.

జననం: అక్టోబరు 4, 1997
పుట్టినస్థలం: హరిద్వార్‌, ఉత్తరాఖండ్‌
స్థానం: వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌
బ్యాటింగ్‌ శైలి: ఎడమచేయి
ఫస్ట్‌క్లాస్‌లు: 22; ఇన్నింగ్స్‌ 32; నాటౌట్‌ 2;పరుగులు 1625; అత్యధికం 308; సగటు 54.16.
టీ-20లు 4: ఇన్నింగ్స్‌ 4; నాటౌట్‌ 1; పరుగులు 73; అత్యధికం 38; సగటు 24.33; స్ట్రయిక్‌ రేట్‌ 105.8; క్యాచ్‌లు 2.
SHARE